Amaravati, April 5: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Update) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో 842 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,90137 డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి చిత్తూరులో ముగ్గురు.. నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందగా, ఇప్పటివరకు 7,239 (Covid Deaths) మరణించారు. ఏపీలో ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులు (Covid Active covid cases) ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు 1,52,08,436 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విమానం క్యాబిన్ క్రూలో పనిచేస్తున్న ఓ మహిళకు కరోనా లక్షణాలు బయటపడడంతో విషయం బయటకొచ్చింది. ఢిల్లీ నుంచి ఎయిరిండియాకు చెందిన బోయింగ్ ఎ320 విమానం ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇక్కడికి వచ్చింది. ఈ విమానం క్యాబిన్ క్రూలో పనిచేస్తున్న ఓ మహిళకు జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఈ విషయం తెలుసుకున్న విమానంలో ప్రయాణించిన వారిలో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన ఎయిరిండియా ప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ క్రూ సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ విమానంలోని ప్రయాణికులను టెర్మినల్ భవనంలోకి పంపించారు. అనంతరం విమానం క్యాబిన్ లోపల పూర్తిస్థాయిలో రెండు సార్లు శానిటైజ్ చేశారు. రాత్రి 8.40 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లవలసిన విమానం సుమారు 2.50 గంటల ఆలస్యంగా అర్ధరాత్రి 11.30 గంటలకు ప్రయాణికులతో బయలుదేరింది.