AP Coronavirus Report: ఏపీలో తాజాగా 793 కరోనావైరస్‌ కేసులు, రాష్ట్రంలో 13,891కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, 180కి చేరిన మరణాలు
COVID-19 Outbreak in India | File Photo

Amaravati, June 29: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 793 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP's Coronavirus) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 81మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ (Coronavirus in Andhra Pradesh) అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 793 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 302మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 180కి చేరింది. ఈ రోజు మృతి చెందిన 11 మందిలో కర్నూలు 5, కృష్ణా 2, నెల్లూరులో 2, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7479 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దిగువ కోర్టుల కార్యకలాపాలను కూడా ఈ నెల 29, 30 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ సునీత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదేని అత్యవసర పరిస్థితి తలెత్తితే న్యాయవాదులు, కక్షిదారులు ఆయా కోర్టులకు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ-ఫైలింగ్‌ ద్వారా పిటిషన్‌ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. సంబంధిత ప్రిసైండింగ్‌ అధికారి ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపడతారని తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో 25నుంచి హైకోర్టుతో పాటు విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జెస్‌ యూనిట్‌ కార్యకలాపాలన్నీ రద్దయిన విషయం తెలిసిందే.