
Amaravathi, July 4: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద విధులు నిర్వహించే 8 మంది పోలీసు కానిస్టేబుళ్లకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు, కరోనా సోకిన పోలీసు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరంతా ఏపీపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న సిబ్బందికి కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో శనివారం రోజు వీరికి సంబంధించిన పరీక్షా ఫలితాలు రాగా, 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం రోజున మొత్తంగా 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 17,699 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 15,141 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
AP's COVID19 Report:

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 12 కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం బులెటిన్ విడుదల చేసే సమయానికి ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 218 కు పెరిగింది.
మరోవైపు ఈరోజు వరకు మరో 311 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,008 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 9,473 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.