Amaravati, Sep 15: ఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,86,531కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 47,31,866 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది.
గడిచిన 24 గంటల్లో 70,511 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,846 మందికి పాజిటివ్‌గా (new corona positive cases) తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కు (AP Covid Report) చేరింది. కొత్తగా 69మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,041కి చేరింది. ప్రస్తుతం 92,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు (Muttamsetti Srinivasa Rao Covid 19) కరోనా సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఫోన్‌లో అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారుడు వెంకట శివసాయినందీష్‌కు కూడా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు.
ఇక ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి వైద్య సేవలు అందించారు.