Vizag Steel Plant Fire Accident (Photo-Video Grab)

Vizag, Nov 5: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు (Vizag Steel Plant Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ యూనిట్లలో మంటలు చెలరేగాయి.

టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రొడక్షన్ యూనిట్‌లో ఉక్కును కరిగించడానికి వినియోగించే టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

టర్బన్ ఆయిల్‌పై నిప్పు రవ్వలు పడటంతో వెంటనే మంటలు చెలరేగాయని అంటున్నారు. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించినట్లు చెబుతున్నారు. 1.2 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల మోటార్లు ఈ మంటల బారిన పడ్డాయని సమాచారం. వినియోగించడానికి వీల్లేకుండా కాలిపోయాయని తెలుస్తోంది. ఈ మోటార్ల విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రొడక్షన్‌ను నిలిపివేశారు.

ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, త్వరలో మూడు మెగా ప్రాజెక్టులు, రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, విశాఖలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు

సంఘటనా స్థలంలో కార్మికులు గానీ, ఉద్యోగులు గానీ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే స్థలాన్ని ఖాళీ చేశారు. సురక్షిత ప్రదేశానికి వెళ్లారు. మంటలు చెలరేగిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలలను అదుపు చేయడంలో నిమగ్నం అయ్యారు. టర్బన్ ఆయిల్ ఎలా లీక్ అయ్యిందనేది ఇంకా తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత దానిపై ఆరా తీస్తామని విశాఖ స్టీల్‌ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ఎంత నష్టం వాటిల్లిందనేది మరోసారి అంచనా వేస్తామని అన్నారు.