అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తదితరులపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (AP CID) ఫిబ్రవరి 8న ట్రయల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణ ప్రకారం విజయవాడలోని ఎస్పీఈ, ఏసీబీ కేసులకు సంబంధించి III అదనపు సెషన్స్ జడ్జి-కమ్-స్పెషల్ జడ్జి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
సీఐడీ (CID) దాఖలుచేసిన అభియోగపత్రంలో నిందితులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఆయన సోదరుడు రాజశేఖర్‌లను ప్రధాన నిందితులుగా ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది.
లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో (Amaravati Inner Ring Road Case) హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఓ వర్గం మీడియా దుష్ప్రచారంపై సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీఐడీ ఖండించింది. ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియాపై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది.
ఇన్నర్ రింగ్ రోడ్‌ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్‌లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది.