ఏలూరు, జూన్ 15: ఏపీలోని ఏలూరులోని విద్యానగర్‌లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఏలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న యడ్ల ప్రాన్సిక (35) అనే మహిళ భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాన్సిక భర్తతో విడిపోయి తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటుంది.
రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ప్రాంచికపై యాసిడ్ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది.
ఈ దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి ఆసుపత్రికి వచ్చి బాధితులని పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని.. వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.