Amaravati, November 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఈ వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలను శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ దినోత్సవాలకు తొలి రోజు శుక్రవారం ముఖ్య అతిథులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవిపొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి అర్పించనున్నారు.
కాగా రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల విరామం తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 నాడు నవనిర్మాణ దీక్షలు పేరుతో వేడుకలను నిర్వహించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగించాలంటే నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలతో 25 ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వేడుకలను చేనేత కార్మికులు, కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల కోసం వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.