 
                                                                 Amaravathi, December 19: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి మూడు రాజధానులు (Three Capital Cities) వస్తాయోమో అని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన దగ్గర్నించీ రాష్ట్రంలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మరియు కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ రావొచ్చంటూ సీఎం జగన్ అన్నారు. దీనిపై అధ్యయనం చేయటానికి ఇప్పటికే జిఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ (GN Rao Committee) వేసినట్లు కూడా తెలిపారు. మరో వారం రోజుల్లో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజధానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా సీఎం ప్రకటనపై విశాఖ మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలపై సానుకూలత వ్యక్తం చేస్తుండగా, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్తే ఇప్పుడు తమను మోసం చేస్తున్నారంటూ రైతులు (Amaravathi Farmers) రోడ్డెక్కారు. వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో 144 మరియు 34 సెక్షన్లను విధించారు. ఏపీకి బహూశా 3 రాజధానులు వస్తాయోమో, ఏపీ సీఎం జగన్ మాటల్లో..
టీడీపీ మరియు జనసేన పార్టీలు వారికి సంఘీభావం తెలియజేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రజలకు సంఘీభావంగా త్వరలో అమరావతిలో పర్యటిస్తానని ప్రకటించారు.
మరోవైపు రాజధాని అంశం హైకోర్టు (High Court of Andhra Pradesh) కు చేరింది. రాజధానిని వికేంద్రీకరించకూడదు, అమరావతిలో ముందస్తు ప్రణాళిక ప్రకారం అభివృద్ధిని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిఆర్‌డిఎను ఆదేశించాలని కోరుతూ రామారావు అనే రైతు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రాజధానుల అధ్యయనంపై ఏర్పాటైన జిఎన్ రావు కమిటీని రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
