AP Capital News: ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది, బహుశా 3 రాజధానులు వస్తాయేమోనన్న ఏపీ సీఎం వైయస్ జగన్, రేసులో అమరావతి, విశాఖ,కర్నూలు, కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ఏపీ సీఎం
AP Assembly session cm-jagan-sensational-comments-ap-capital(Photo-Twitter)

Amaravathi, December 17: ఏపీ శాసనసభ సమావేశాల్లో (AP Assembly session)ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(AP CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిపై (AP Capital) అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్  రావొచ్చన్నారు.రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని ఏపీ సీఎం  వెల్లడించారు.

ఏపీలో మూడు రాజధానులు (3 Capitals) అవసరం ఉందన్నఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి 3 రాజధానులు వస్తాయేమో అంటూ ఇన్ డైరక్టుగా  రాజధాని సస్పెన్స్ ని తొలగించే ప్రయత్నం చేశారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందన్న సీఎం జగన్ ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమో అని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఏపీ సీఎం జగన్ మాటల్లో..

‘‘ఏపీలోనూ బహూశా 3 రాజధానులు వస్తాయోమో. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టొచ్చు. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఒకవైపున, లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఇక్కడ పెట్టొచ్చు. మూడు క్యాపిటల్స్‌ రావాల్సిన పరిస్థితి కనిపిస్తావుంది. దీనిపై సీరియస్‌గా చర్చించాల్సిన అవసరముంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దానిపై జాగ్రత్తగా వ్యవహరించాలి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు సీరియస్‌గా చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేయడం కోసమే నిపుణులతో ఒక కమిటీని వేశాం. ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. వారం పదిరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తే బావుంటుందనే దానిపై సుదీర్ఘమైన నివేదికను కమిటీ తయారు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత లోతుగా చర్చించి మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి జరిగేలా ముందుకు వెళ్లాలి. మనకున్న ఆర్థిక వనరులతో ఏవిధంగా చేయాలన్న దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంద’‘ని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయన్న ఆర్థికమంత్రి బుగ్గన

దీనిపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేశారు. కమిటీ నివేదిక రాకముందే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఉంటాడా, విశాఖలో ఉంటాడా అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయనది తగ్లక పాలన అని ఎందుకన్నానో ఇప్పుడైనా తెలుసుకోవాలని అన్నారు.

చంద్రబాబుపై విమర్శలు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4070 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. బినామీ పేర్లతో భూములు కొన్నారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. అయితే, అయిదేళ్ల కాలంలొ ఆయన కేవలం 5800 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. అందులోనూ బాండ్లు..అప్పుల ద్వారా తెచ్చారు. దీని కోసం ప్రతీ ఏటా రూ 700 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీనిని అప్పు తేవాలంటే.. ఎంత వడ్డీ కావాలి. మనం కట్టగలమా అని ఆలోచించాలని సూచించారు. కేవలం 20 కిలో మీటర్ల పరిధి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయటం కంటే రాష్ట్రం మొత్తం డెవలప్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అసవరం ఉందని సీఎం అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం అంత ఖర్చు పెట్టాలని తనకూ ఉన్నా..పరిస్థితులు సహకరించటం లేదని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేసారు.