Amaravathi, December 17: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో(AP Assembly session) చివరి రోజు రాజధానిపై చర్చ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) మీద అధికార ప్రతిపక్ష పార్టీలు వాదోపవాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన (Finance Minister Buggana Rajendranath Reddy)రాజధాని అమరావతిలో అన్నీ అక్రమాలే జరిగాయంటూ వాస్తవాలను అసెంబ్లీలో వినిపించారు. అమరావతి ఏరియాలో తమకు భూములుంటే ఏ చర్య అయినా తీసుకోవచ్చని సవాల్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు(N Chandrababu Naidu) దిమ్మతిరిగిపోయే వివరాలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
సుమారు నాలుగు వేల ఎకరాలను చంద్రబాబు, ఆయన అనుచరులు, బంధువులు, పార్టీ నేతలు కొనుగోలు చేశారని పేర్లతో సహా వివరాలు వెల్లడించారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ సంస్థకు 14.22 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బాలకృష్ణ వియ్యంకునికి 499 ఎకరాలను రాజధాని ప్రాంతంలో కేటాయించారని, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, రావెల కిశోర్ బాబు, లింగమనేని రమేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి తదితరులు తమ పేరిట, తమ బంధువుల పేరిట రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని వివరించారు.
ఒక్కరోజే 13 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ అమోదం
ఈ భూములను ముందు చౌకధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారని బుగ్గన అన్నారు. స్థానికులు కాకుండా వేరే వాళ్ళు భూములు ఇక్కడ కొంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ అనకుండా ఇంకేమంటారని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన చాలా మంది బినామీ పేర్లతో అమరావతి ఏరియాలో భూములు కొన్నారంటూ పెద్ద జాబితాను బుగ్గన చదివి వినిపించారు.
3 లక్షల ఇళ్లకు రూ.2 వేల 626 కోట్ల దోపిడి
బ్యాంకులకు 4 కోట్ల రూపాయలకు ఎకరా కేటాయించిన గత ప్రభుత్వం తమకు అనుకూల విద్యాసంస్థకు కేవలం 20 లక్షల రూపాయలకు ఎకరాను కేటాయించిందని తెలిపారు. అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సింగపూర్ సంస్థలను భాగస్వామిగా చేర్చుకున్నారని ఆరోపించారు. రెండు ప్రభుత్వాల మధ్య రాజధాని ఒప్పందం అని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, నిజానికి రెండు ప్రైవేటు సంస్థల మధ్య ఒప్పందంగానే దాన్ని రూపొందించారని బుగ్గన వివరించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు
అయిదేళ్ళ క్రితం రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోతే తాను అన్నీ ఆలోచించే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. విజయవాడలో కేపిటల్ పెడుతున్నామని తాము చెప్పినప్పుడు అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా తమతో ఏకీభవించారని గుర్తు చేశారు. రాజధాని ఎక్కడన్నా పెట్టండి.. కానీ కనీసం 30వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ఆనాడు సూచించారని చంద్రబాబు చెప్పారు.
9మంది టీడీపీ సభ్యుల సస్పెన్సన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చిస్తున్న సందర్భంలో తొమ్మిది మంది టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్ లను ఈ ఒక్కరోజుకి సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
ఏపీ టీడీపీ సభ్యులు తొమ్మిది మంది సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేయడానికి గల కారణాలను స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయలేదని అన్నారు. గడచిన వారం రోజులుగా శాసనసభా సమావేశాల తీరును గమనిస్తున్నామని, ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరకు ప్రతిపక్ష సభ్యులు రావడంతో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. గౌరవ సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం సభా నాయకుడు, మంత్రులు, సభ్యులకు, తనకు గానీ ఎవరికీ ఇష్టం లేదని అన్నారు.
రాజధాని అమరావతిపై చాలా మంది భ్రమలో ఉన్నారని, ఈరోజున ఆ భ్రమను ప్రభుత్వం పటాపంచెలు చేస్తూ వాస్తవాలు బయటకొచ్చే పరిస్థితిలో టీడీపీ సభ్యులు ఈవిధంగా చేయడం సరికాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాదు బాధాతప్త హృదయంతో తొమ్మిది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘నేను అయితే చాలా మనస్తాపానికి గురయ్యాను. చాలా బాధతోనే ఈ కార్యక్రమాన్ని చేయవలసి వస్తోందని సభకు తెలియజేసుకుంటున్నా’ అని తమ్మినేని పేర్కొన్నారు.