Tirupati, Dec 17: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravati Farmers) ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీ బహిరంగ సభను (Amaravati Farmers Meeting In Tirupati) ఏర్పాటు చేశారు. ఈ సభకు అధికార వైసీపీ మినహా జనసేన, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు హాజరయ్యాయి.
వీరితో పాటుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా పాల్గొన్నారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandra babu) ఎంపీ రఘురామకృష్ణరాజు ఆలింగనం చేసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు (Public Meeting In Tirupati) చంద్రబాబు, రఘరామకృష్ణరాజు, నటుడు శివాజి, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ, శ్రీనివాసానంద సరస్వతి స్వామి (గుంటూరు), కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీమంత్రి పరిటాల సునీత హాజరయ్యారు.
అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. మహాపాదయాత్రలో పాల్గొన్నవారిపైనా కేసులు పెట్టారని తెలిపారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్‌రెడ్డి మాట తప్పారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చెప్పారు. సీఎం జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రజారాజధాని అమరావతిపై మూడు ముక్కలాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి అమరావతి బ్రహ్మాండమైన ఆర్థికవనరుల్ని సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు. దూరదృష్టిలేని జగన్‌రెడ్డి అమరావతిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. కోర్టు ఆదేశాలు పాటిస్తూ నిర్ణీత సమయానికి చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.
అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాజధాని రైతుల పోరాటానికి నా సెల్యూట్. ఒక రాజధానితోనూ అధికార వికేంద్రీకరణ సాధ్యమే.మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్‌రెడ్డిదే. ఏపీకి అమరావతి రాజధాని కల్పవృక్షం. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే వేల కోట్ల ఆదాయం వచ్చేది. అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని జగన్ ప్రకటించాలి’’ అని తులసిరెడ్డి పేర్కొన్నారు.
ఒక్క చాన్స్ అంటూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారని మండిపడ్డారు. విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారన్నారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారని చెప్పారు. అమరావతిలో అనేక ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులిచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
అమరావతి అనే శిశువును జగన్‌రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్‌రెడ్డి లాంటి మూర్ఖుడు మరొకరు ఉండరన్నారు. మహిళల కన్నీరు ఏపీకి మంచిది కాదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని నారాయణ తెలిపారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య సీఎం జగన్‌రెడ్డి చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. రాజధానిపై జగన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నేతలు మద్దతిస్తున్నారని, కేంద్రమంత్రి అమిత్‌షా ఒక్క ఫోన్ చేస్తే జగన్ శిరసావహిస్తారని తెలిపారు. ప్రధాని మోదీ ఒక్క ఫోన్ చేస్తే జగన్ అమరావతిని కాదంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని ఎంపీ రఘురామ అన్నారు. రాజధానిపై కులం ముద్ర వేశారని అపార్థం చేసుకున్న వారికి అర్థం చెప్పేవారు లేకే రాష్ట్ర రాజధాని లేని పరిస్థితి ఏర్పండిందన్నారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు అని, అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా రూపొందించారని వివరించారు. కొంత కాలం ఓపిక పడితే అమరావి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎంపీ తెలిపారు.