Vjy, Oct 10: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేశ్‌ని ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
గత నెల 30న 41ఏ కింద నాకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు. ఆ మేరకు ఇవాళ విచారణకు హాజరయ్యా. అయితే, ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు. సీఐడీ అధికారులు నన్ను 50 ప్రశ్నలు అడిగారు. నేను, నా కుటుంబసభ్యులు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలా లాభపడ్డారో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.
నేను ఇప్పటికే స్పష్టంగా చెప్పా. ఇది కక్షసాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసు. ఈ ప్రభుత్వం దొంగ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోంది. బుధవారం వివిధ పనులతో బిజీగా ఉంటాను.. ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎంత సమయమైనా సరే ఇవాళే అడగాలని.. వాటికి సమాధానం చెబుతానని విచారణాధికారిని కోరా. అయినప్పటికీ బుధవారం మరోసారి విచారణకు రావాలని చెబుతూ అక్కడే నాకు 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఈరోజు వచ్చిన విధంగానే బుధవారం కూడా విచారణకు హాజరవుతా’’ అని లోకేశ్ తెలిపారు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఏపీకి రాజధాని ఏది? పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అడిగారు కాబట్టే టీడీపీ అధినేత చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు ఒక పోస్టు పెడితే వాళ్లపై ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైల్లో పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా దొంగ కేసులు పెట్టి ఇలా విచారణకు పిలుస్తారు.
సమయాన్ని వృథా చేస్తారు. చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు? ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదనడం సరికాదు. ఏసీబీ, సీఐడీ అనేవి ప్రభుత్వ సంస్థలే కదా.. ఎలాంటి దర్యాప్తు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికే కదా అవి రిపోర్టు చేసేది. ఈ విషయంలో సీఎం జగన్‌కు అవగాహన లేదనుకుంటాను. ఆయన డీజీ దగ్గర పాఠాలు చెప్పిచ్చుకుంటే బాగుంటుంది’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చారన్నది నారా లోకేష్‌పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్‌ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది.