Vjy, Nov 7: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో (Inner Ring Road Case) టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయన్ను అరెస్ట్ చేయబోమని అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. తొందరపాటు చర్యలేమీ తీసుకునే ఉద్దేశం లేదని ఏజీ తెలిపారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ నిర్ణయం (Amaravati Inner Ring Road case) వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. నేడు ఆస్పత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఏఐజీకి వచ్చిన చంద్రబాబు ఒకరోజు ఇక్కడే ఉండి పలు వైద్యపరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లిన విషయం విదితమే. మళ్లీ సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల బృందం వివిధ వైద్యపరీక్షలు చేయడంతో పాటు చర్మ సంబంధిత చికిత్స అందించినట్లు సమాచారం. నేడు క్యాటరాక్ట్ చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఆయన చేరుకున్నారు.