Visakhapatnam, May 25: ఏపీలో విశాఖ పట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు (Boat Capsize in Sileru Reservoir) బోల్తా పడ్డాయి. సీలేరుగుంట వాడ దగ్గర జరిగిన ఈ ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది (1 dead, 8 missing after boat capsizes in Sileru river) ప్రయాణిస్తున్నారు.
వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు.వీరిలో హైదరాబాద్ నుంచి 11 మంది ఒడిశా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. సీలేరు రెజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు.
ఇక రెండో ట్రిప్‌లో అయిదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుంచి బయటపడి ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంత్తైన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్‌కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.