Alluri Sitharama Raju dist, June 14: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ జాతీయ రహదారి–30పై ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం (Andhra Pradesh Road Accident) చోటు చేసుకుంది. అర్థ దాటిన తరువాత 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతిచెందారు. పొట్టకూటి కోసం వెళుతూ తమ బిడ్డలను సొంత ఊరిలో వదిలి వెళ్లలేక తమతో తీసుకెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో బిడ్డలను కోల్పోయి ఆ తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రమైంది.
విజయవాడలో పనులు చేసేందుకు ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లా బోటిగూడకు చెందిన కొంతమంది శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంగీత ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కారు. అక్కడి నుంచి 40 మందితో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి దాటాక చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం మధ్యలో అదుపుతప్పి, అటవీ ప్రాంతంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా అందులో ముగ్గురు చిన్నారులు (5 people including 3 children die) కూడా ఉన్నారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనాల డ్రైవర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ధనేశ్వర్ దళపతి(24)తో పాటు జీతు హరిజన్(5), సునేనా హరిజన్(2) అనే చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. డుమూర్ హరియన్(40), చిన్నారి మహిసాగర్ మిత్రా(5) భద్రాచలం ఆస్పత్రిలో మరణించారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బయలుదేరినప్పటి నుంచే చాలా ర్యాష్‌గా నడిపేవాడని, మార్గమధ్యంలో బస్సు నడుపుతూనే మద్యం కూడా తాగాడని, వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా అలాగే వాహనాన్ని నడిపాడని ప్రమాదంలో గాయపడి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికుడు తెలిపాడు. అటవీ ప్రాంతంలోకి రాగానే మరింత వేగం పెంచాడని మలుపు వద్ద అదుపు చేయలేక పోవడంతో బస్సు బోల్తాపడిందని చెప్పాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో తొమ్మిది మంది ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.