Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2000కు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 50 పాజిటివ్ కేసులు, మరో కరోనా మరణం నమోదు, వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
AP CM YS Jagan | (File Photo)

Amaravathi, May 10:  ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు 2000 దాటే అవకాశం ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 50 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 1980కు చేరింది. 8,666 సాంపిల్స్ ని పరీక్షిస్తే కేవలం 50 మంది మాత్రమే కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ కర్నూల్ జిల్లాలో కోవిడ్-19 పేషెంట్ ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 45కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 38 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 925 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1010 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి 16, కర్నూల్ జిల్లా నుంచి 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూర్ జిల్లా నుంచి 6, అనంతపూర్ మరియు నెల్లూరు జిల్లాల నుంచి చెరి 5 కేసులు, ప్రకాశం జిల్లాలో 2, విశాఖపట్నం, కడప మరియు కృష్ణా జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

status of positive cases of #COVID19 in Andhra Pradesh

 

సీఎం జగన్ సమీక్ష

మరోవైపు రోజురోజుకు ఈ కోవిడ్-19 నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 2 వేలకు చేరువయినప్పటికీ అందులో సగం మాత్రమే ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌లు పెరుగుతున్న తరుణంలో మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి‌ అధికారులకు సూచించారు.

తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో కోవిడ్‌-19 నివార‌ణ చ‌ర్య‌ల‌పై సంబంధిత అధికారుల‌తో సీఎం జగన్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఏపీలో కరోనా నియంత్రణ దిశగా ఇప్పటికే మంచి వైద్యం అందజేస్తున్నామని, రోగులకు కల్పిస్తున్న వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రంలోకి కొత్తగా ఎంటర్ అయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారి మీద దృష్టి పెట్టాలని తెలిపారు. కోయంబేడు మార్కెట్‌ కు వెళ్లి వచ్చిన వారి వల్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తిరిగి వస్తున్న వలస కార్మికులకు కూడా స్క్రీనింగ్ నిర్వహించాలని చెప్పారు.

ఇప్పటికైతే, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఉంటున్న వారికే ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని, వైరస్‌ వ్యాప్తి దాదాపుగా ఆ క్లస్టర్లకే పరిమితం చేయగలుగుతున్నాం, ఇది ఒక మంచి పరిణామం అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.