Vjy , Nov 24: ఇప్పటం ఇళ్లు కూల్చివేశారంటూ వేసిన కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ( AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష (fined one lakh to petitioners) చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా కోర్టు విధించింది. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారు.
కాగా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ (Ippatam demolitions) హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషనర్లకు జరిమానా విధించింది.