వై నాట్ 175 అనే నినాదంతో వైసీపీ పార్టీ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి కచ్చితంగా ఓడిస్తామని గట్టిగా చెప్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త నినాదం ఎత్తుకున్నారు. ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైసీపీకి తన సత్తా ఏంటో చాటుతామంటున్నారు.
కుప్పం బస్టాండ్ వద్ద బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లక్ష ఓట్ల మెజారిటీతో కుప్పంలో పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ సేవకుడిగా పుడతాను అని చంద్రబాబు అన్నారు.కుప్పం టీడీపీ కంచుకోట. కుప్పం, హిందూపురంలో 9 సార్లు పార్టీ గెలిచింది. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కుప్పంను నేను ఎంచుకున్నా. పులివెందులకు సైతం నీళ్లిచ్చాను. 9 నెలల్లో అధికారంలోకి వస్తున్నాము. అనుమానాలు అవసరం లేదు. హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.
2019 తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం వల్ల విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ నకు గురైంది. ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఏపీలో పాలన పడకేసింది. వైసీపీ నేతలు మద్యం దుకాణాల్లో రూ.2వేల నోట్లు మార్చుకుంటున్నారు. కుప్పంని నేరస్తుల హబ్ గా తయారు చేశారు.కుప్పంలో కొందరు వైసీపీ నేతలు వింత పశువులు, వింత జంతువులుగా ప్రవర్తిస్తున్నారు. సీఎం జగన్ నియోజకవర్గంలో ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.
1989లో మొట్టమొదటిసారిగా కుప్పంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉన్నా, వెనుకబడిన నియోజకవర్గం కుప్పంనే ఎంచుకున్నా. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రాజకీయ నాయకులు కులం, మతం, బలం బంధువర్గాన్ని చూసి నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటారు. కానీ, నా బలం ఈ ప్రజలే. అందుకే, అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కుప్పంను ఎంచుకున్నా. అను నిత్యం మీ అభివృద్ధి కోసం పని చేశాను” అని చంద్రబాబు అన్నారు.