Chandra babu (Photo-Twitter)

VJY, Nov 17: ఈ ముఖ్యమంత్రికి పాలన చేతకాదు.. నియంతగా మారాడు. దావూద్‌ ఇబ్రహీంను మించిపోయాడు..’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పత్తికొండలో భారీ రోడ్‌షో, బాదుడే బాదుడు జనం సభలో ఆయన పాల్గొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం దగ్గర విద్యార్థుల ముఖాముఖిలో మాట్లాడారు.

ఈ సభలో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని.. లేకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలని (Andhra Pradesh Assembly Elections 2024) స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని.. ఇప్పుడు కౌరవసభను గౌరవసభగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. వీటన్నింటిని తుదముట్టించాలని పిలుపునిచ్చారు.

షాకింగ్ వీడియో, టీడీపీ నేతను కత్తితో నరికేందుకు ప్రయత్నించిన దుండగుడు, భవాని మాల వేషంలో భిక్ష తీసుకుంటున్నట్లుగా నటిస్తూ దాడి

ఈ సందర్భంగా పోలీసులను కూడా చంద్రబాబు హెచ్చరించారు. పోలీసు శాఖలో కొందరు చేస్తున్న తప్పుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని.. తప్పులు చేస్తే జగన్ కాపాడలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో రోడ్లు వేయలేకున్నా.. మూడు రాజధానులు కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధ పెడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చేది గోరంత అయితే.. దోచేది కొండంత అంటూ ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.

తనను అడ్డుకోవడానిని పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎం బ్యాచ్‌ను పంపించారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. కోడి గుడ్లు, రాళ్లు విసిరితే భయపడనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారని ప్రచారం జరుగుతోందని.. తాను వస్తే పథకాలు కట్ చేయనని హామీ ఇచ్చారు. నవరత్నాల పథకాలు పెద్ద మోసం అని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, కలిసొచ్చే వారితో పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్‌ వచ్చాక ఒక్క పరిశ్రమ రాలేదు. జాబ్‌ మేళా లేదు.. జాబ్‌ క్యాలెండర్‌ లేదు. తెదేపా అధికారంలో ఉంటే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే వాడిని. నా మీటింగ్‌కు వచ్చి డిస్టర్బ్‌ చేస్తారా? పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎం బ్యాచ్‌ను పంపించారు. పేటీఎం బ్యాచ్‌కు మేం భయపడం.

జగన్‌.. నేను మీ నాన్నను చూశా. మీ తాతను చూశా. నీకు భయపడతానా? ఈ నరహంతక జగన్‌ని ఇంటికి పంపించాలి. అన్నీ పత్తికొండ ఎమ్మెల్యేకే కావాలి. అరాచక శక్తులను తుదముట్టించాలి. కొంతమంది పోలీసుల వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు వస్తోంది. మీరు తప్పు చేస్తే సీఎం కాపాడలేరు. జగన్ ఇచ్చేది గోరంత.. చెప్పేది కొండంత. హైదరాబాద్‌ నగరాన్ని 25 ఏళ్ల క్రితం అభివృద్ధి చేశా. నా ముందు చూపు వల్లే హైదరాబాద్‌లో యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆడపిల్లలే ఐటీలో ఎక్కువ సంపాదిస్తున్నారు. జగన్‌ తాడేపల్లిలో కూర్చొని బటన్‌ నొక్కుతాడు.

రాత్రి ఇంటికి లారీల్లో డబ్బులు వస్తాయి. రాత్రంతా లెక్కపెట్టుకుంటాడు. వివేకాహత్య కేసుపై ఆయన కుమార్తె సునీత ఫైట్ చేసి వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయించారు. ఆమె పోరాటానికి అభినందనలు. పత్తికొండకు రోడ్డు వేయలేని వ్యక్తి రాష్ట్రానికి 3 రాజధానులు కడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

మరోవైపు తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆయన నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..? అని అడుగుతున్నారు. ఎప్పుడు ఇంత ఆవేశంగా ప్రకటన చేయని చంద్రబాబు.. ఉన్నట్టుండి సింపతీని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇవ్వాలని అడగ్గా.. చంద్రబాబు కూడా తనకు అవకాశం ఇవ్వకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ వ్యాఖ్యనించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీప్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఏపీలో ఇప్పటి నుంచే హీట్ మొదలైంది.