ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (State Governor Justice Abdul Nazir) ప్రసంగిస్తున్నారు. పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు.
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి (మంగళవారం) వాయిదా పడనున్నాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. బుధవారం (ఫిబ్రవరి 7) ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం పొందనుంది.
గవర్నర్ ప్రసంగిస్తూ..తమ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ లను ప్రవేశ పెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను చేశామని తెలిపారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. మనబడి నాడు - నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. సమాజిక న్యాయం, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
8, 9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్ లను పంపిణీ చేశామని గవర్నర్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న గోరుముద్దకు ఇప్పటి వరకు 4,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది.