Vjy, July 22: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Speech) ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని కొనియాడారు. విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది.
రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. మార్పు కావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ అన్నారు. ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు?’’ అంటూ నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ నిలదీత, ఈలోపు సభ ప్రారంభం అవుతుండడంతో కాసేపటికికే నల్ల కండువాలతోనే వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు.నల్లకండువాలతో సభకు వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’ నినాదాలు చేశారు.
గవర్నర్ ప్రసంగం మధ్య వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించనున్నారు.