Amaravati, Dec 1: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజు (AP Assembly Winter Session 2nd day) మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ, కరోనావైరస్ నియంత్రణలో విజయవంతమైన ప్రభుత్వ చర్యలపై చర్చ జరగనుంది. ఇదిలా ఉంటే టిస్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఇదిలా ఉంటే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్ సస్సెండ్ చేశారు.రెండవ రోజు శాసనసభ కార్యక్రమాల్లో వాడి వేడి రాజుకుంది. కీలకమైన బిల్లులు చర్చకు వచ్చిన నేపథ్యంలో టీడీపీ సభ్యులు సభలో చర్చకు అడ్డుపడుతుండటంతో స్పీకర్ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఏపీ శాసనమండలి ముందుకు ఆంద్రప్రదేశ్ ఆంద్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ చట్టం 2020 రానుంది. అలాగే పలు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకు రానుంది. అసైన్డ్ భూముల సవరణ చట్టం 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ వాట్ రెండవ సవరణ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ వాట్ మూడవ సవరణ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ ప్రొఫిషన్స్, వాణిజ్య, కాలింగ్, ఉద్యోగ సవరణ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ సవరణ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ సవరణ బిల్ 2020, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ 'లా' స్ రెండవ సకారణ బిల్ 2020 బిల్లులను నేడు ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచనుంది.
20లక్షల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని...వీటిల్లో 90శాతం టిడ్కో ఇళ్ళు పూర్తయ్యాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏడాదిన్నరగా పేదలకు వాటిని స్వాధీనం చేయలేదని, దీంతో ప్రతినెలా అద్దె భారం మోపారన్నారు. నా ఇల్లు నా సొంతం కార్యక్రమంతోనే ప్రభుత్వంలో స్పందన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇళ్లకు సంబంధించి పాత బకాయిలన్నీ చెల్లించి లబ్ధిదారులకు వాటిని అందచేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు వెళ్లి చంద్రబాబు ఇళ్ళు కావాలా జగన్ ఇళ్ళు కావాలా అని అడగటం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు క్యాటగిరీల్లో నిర్మించిన ఇళ్ళు ఉచితమేనని ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చారని... ఇప్పుడు మాట మార్చటం తగదన్నారు. పేదలందరికీ ఇళ్లను ఉచితంగానే ఇవ్వాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేదని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో (Andhra Pradesh Assembly Winter Session) టీడీపీ రచ్చ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ప్రతిపక్ష సభ్యులు నిన్న వ్యవసాయ రంగంపై చర్చ అంటే సీఎం జగన్ పెద్ద మనసుతో మిగతా అంశాలను పక్కనపెట్టి అంగీకరించారు. చర్చ ప్రారంభించిన తర్వాత డ్రామా క్రియేట్ చేసి రచ్చ చేశారు. ఈరోజు హౌసింగ్‌పై చర్చ అడిగారు. సరే ఇస్తామంటే.. లేదు లేదు ఇప్పుడే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఏ అంశంపైనా అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టీడీపీ సభ్యులు ఇంత భయపడుతున్నారేందుకు?’ అని ప్రశ్నించారు.
టీడీపీ సభ్యులు కావాలనే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. దీంతో రాజేంద్రనాథ్ జోక్యం చేసుకున్నారు. సజావుగా జరిగే సభను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఈ విధంగా అడ్డుకోవడం అన్యాయమన్నారు. నిన్న కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి సభను అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ జరిగితే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రతిపక్ష నేత నిన్న సభలో మాట్లాడిన తీరు దురదృష్టకరమని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షనేత అలా వ్యవహరిస్తే ఇక కింది వాళ్ళు బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారాన్ని మరిచి ముఖ్యమంత్రిని వాడూ వీడు అని వ్యాఖ్యానించడం దారుణమని, చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.