TDP Protest (Photo/X)

Vjy, Sep 11: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. నిన్న టీడీపీ విడుదల చేసిన ప్రకటనలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం 11.09.2023 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి’’ అని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

బంద్ కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా, జైభీమ్ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బంద్ కు దూరంగా ఉంది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!

టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాల్చేస్తున్నారు. పలు చోట్ల విద్యా సంస్థలు, షాపులను స్వచ్చందంగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

Here's Updates

ఏలూరు జిల్లాలో ఎక్కడా ధర్నాలకు, నిరసనలకు, బంద్ కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు ఆటంకాలు కలిగించినా, నిరసన, ధర్నాలు చేపట్టినా... పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన జీవనానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్‌కు బీజేపీ కూడా మద్దతు ఇచ్చినట్లుగా బిజెపి లెటర్ హెడ్‌పై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరుతో లేఖ విడుదలైంది. బీజేపీ శ్రేణులు కూడా ధర్నాలలో పాల్గొనాలని, చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని అందులో పేర్కొన్నారు.టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు ప్రకటించడం తొలుత నిజమేనని అంతా భావించారు. ఆ తర్వాత కాసేపటికే పురంధేశ్వరి ఖండన విడుదల చేశారు. బంద్‌కు తాను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్స్ ప్ గ్రూప్ లలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు.ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించింది.

చంద్రబాబు రిమాండ్‌ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి తెగబడే అవకాశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది.