
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meet) జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కు కేబినెట్ ఆమోదం (AP Budget Session 2022) తెలిపింది . అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ఏపీ దేశ సగటు రేటు దాటిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ ప్రకటించారు. సోషియో ఎకనామిక్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయగా.. ముఖ్యాంశాలను విజయ్ కుమార్ వెల్లడించారు.
వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయ్యిందన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయ్యింది. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగింది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని విజయ్ కుమార్ వెల్లడించారు. అంతకు ముందు ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో.. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయి. నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించామని మంత్రి బుగ్గన తెలిపారు.