VJY, Jan 9: పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు కలయికపై శాప్ ఛైర్మన్,వైసీపీ యువజన యువజన విభాగం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని.. ఒక్కటే అని తాము భావిస్తున్నట్లు బైరెడ్డి (Byreddy Siddharth Reddy) ఉద్ఘాటించారు. ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా గెలిచేది సీఎం జగన్ అని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో 175కు 175సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో మా వద్ద లెక్కలు ఉన్నాయి. ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే చర్చకు రండి అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
ఇక చంద్రబాబు టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేనలు (Chandrababu And Pawan) ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.11 మంది చనిపోతే పవన్ కనీసం పరామర్శించలేదు. మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం. చంద్రబాబు మంచి పాలన ఇవ్వలేదు.. కాబట్టే ప్రజలు ఓడించారు. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘2024 షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ కూడా వారితో కలిస్తే సీపీఐ రామకృష్ణ ఏం చెప్తారు. ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం కావడాన్ని జనం చూస్తున్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.