Amaravati, January 17: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (AP Cabinet) శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. నిజానికి ఈనెల 20న కేబినేట్ భేటీ ఉంటుందని తొలుత ప్రకటించినప్పటికీ, తేదీని రెండు రోజుల ముందుకు జరుపుతూ రేపే మంత్రివర్గం సమావేశం అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజధాని అంశంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) తో సమావేశమై 'ప్రాథమిక' నివేదికను సమర్పించింది. ఇందులో అమరావతి పరిధిలోని రైతుల ఆందోళన మరియు సచివాలయం ఉద్యోగులు లేవనెత్తిన పలు సందేహాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు జరిగే కేబినేట్ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం మధ్యాహ్నం నుంచి జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టుపై చర్చించనున్నారు. అయితే పలు సిఫార్సులు మినహా రాజధాని వికేంద్రీకరణకు హైపవర్ కమిటీ (High Power Committee Report) సానుకూలమైన సూచనలే చేసిందని కొన్ని వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. రాజధానిపై జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన అవేవి జరిగిపోవు- పవన్ కళ్యాణ్
మరోవైపు ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలోనే రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రకటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.