AP News Updates: సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్, కీలక అంశాలపై చర్చ;  ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి, నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు
AP CM YS Jagan | (File Photo)

Amaravathi, August 6: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ఆగష్టు నెలలో అమలు చేయబోయే నవరత్నాల పథకాల అమలు, నూతన విద్యావిధానం, ఆర్టీసీ ఆస్తులు, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, కృష్ణా నది వరద‌ ఉధృతి కొనసాగుతోంది. వరద పెరిగే కొద్ది ముంపుకు గురికాబోయే ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో

ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం పులిచింతల ‌వద్ద ఔట్ ఫ్లో 5,11,073 క్యూసెక్కులు ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. నిన్న పులిచింతల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో సాంకేతిక లోపం తలెత్తి 16వ గేట్ వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలకు కూడా ఉపక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతమైతే పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం మరమత్తులు చేపడుతుంది.

ఇక, ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది. మార్క్స్‌ మెమోలను కూడా ఈరోజే విడుదల చేయనుంది. విజయవాడలోని ఆర్‌ & బీ భవనంలో సా: 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. కోవిడ్‌ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను http://bse.ap.gov.in తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 2020-21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019-20 టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా టెన్త్ బోర్డ్ ప్రకటించనుంది.

అలాగే, 2020- 21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ కనీస పాస్ మార్కులతో సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన పీవీ సింధు శుక్రవారం ఏపిలో పర్యటిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పీవీ సింధు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దేశానికి కాంస్య పతకం అందించినందుకు గానూ ఆయన సింధును అభినందించారు. ఏపి నుంచి మరెంతో మంది సింధులు తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఏపి ప్రభుత్వం తరఫున పీవీ సింధుకు రూ. 30 లక్షల రివార్డును అందించారు. త్వరలో విశాఖ అకాడమీలో శిక్షణ అందిస్తానని పేర్కొన్న పీవీ సింధు, భవిష్యత్తులో 2024 ఒలంపిక్స్ క్రీడల్లో మరెన్నో పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక పీవీ సింధు ఏపిలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమెకు అడుగడుగునా ఘనస్వాగతం అలభించింది.