VJY, Mar 2: ఏపీ రాజధాని కేసు అంశంపై (Amaravati Capital Case) సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనాన్ని ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. కాగా, ఈ ప్రతిపాదనపై జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం స్పందించి.. సీజేఐ వద్ద మెన్షన్ చేయాలని సూచించింది. ఈ కేసుపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం మార్చి 28వ తేదీన విచారణ చేపట్టనుంది.
28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం (Supreme Court) తెలిపింది. దీనిపై సీజేఐ సర్క్యులర్ ఉందని గుర్తుచేసింది. ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని.. ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ కేఎం జోసెఫ్ చెప్పారు.
అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ అన్నారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని చెప్పారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.