Eluru, June 6: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.
పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు.
పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు.