CM YS Jagan (Photo-AP CMO Twitter)

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

సాగర్ కాల్వలో పడిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, వివాహ రిసెప్షన్‌కు వెళ్తూ 7 మంది తిరిగిరాని లోకాలకు

వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. బస్సు పొదిలి నుంచి బయలుదేరి అర్థగంటలోనే ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో మృతులంతా పొదిలి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అజీజ్ (65), అబ్దుల్ హాని (60), రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్. షబీనా (35), షేక్. హీనా (6)గా గుర్తించారు.