విశాఖ, ఆగస్టు 1: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఈ మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ..విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్. ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉంది.రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తాం.ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఇనార్బిట్ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ తయారు కాబోతుందని తెలిపారు. దక్షిణాదిలోనే విశాఖ మాల్ అతిపెద్దదని... రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. మాల్ నిర్మాణంతో రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. అనంతరం జీవీఎంసీ పరిధిలో రూ. 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు.
దీంతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు.