Narasapuram, Nov 21:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో (CM Jagan Narasapuram Visit) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు.
శంకుస్థాపనలు ఇలా..
♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు.
♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం.
♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు.
♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు.
♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం.
♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు.
♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం.
♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం.