Vanamahotsavam 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'జగనన్న పచ్చ తోరణం - వన మహోత్సవం', మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సీఎం జగన్, రాష్ట్రంలో ప్రతిఒక్కరూ చెట్లు పెంచాలని పిలుపు
Jagananna Pacha Thoranam - Vanamahotsavam | Photo: Twitter

Guntur, August 5: జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రావి, వేప మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. వనహోత్సవం కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చెట్ల పెంపకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో 33 % పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పేర్కొనారు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. చెట్లు ఉంటే రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ ఏపిని పచ్చతోరణంలా మార్చాలని జగన్ పిలుపునిచ్చారు.

ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వనమహోత్సవాన్ని భారీ ఎత్తున చేపట్టింది. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటారు. వీటితో పాటు 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ ఈసారి మొక్కలు నాటనున్నారు.

Here is the update from CMO:

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పచ్చదనంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని సూచించారు.