New Delhi, June 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఇప్పుడు విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, ఈ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా సహా మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై సీఎం జగన్ కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ధర్మేంద్ర ప్రధాన్ ను సిఎం కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం ఏపి ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. సుమారు గంటపాటు వీరి సమావేశం కొనసాగింది. ఏపిలో త్వరలోనే పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామి ఇచ్చారు, మరికొన్ని విషయాల్లో కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
అనంతరం, సీఎం జగన్ కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. ఏపి పౌర సరఫరాలకు రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను సీఎం విజ్ఞప్తి చేశారు.
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న ఏపి సీఎం, కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలలో బిజీగా గడిపారు. తొలిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల ఇంధన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ మరియు పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్లను కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ఏపికి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులు మొదలైన అంశాలపై చర్చించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో గురువారం రాత్రి 9 నుంచి రాత్రి 10.35 గంటల వరకు సమావేశమైన సీఎం జగన్, రాష్ట్ర అభివృద్ధి మరియు ఇతర అపరిష్కృత సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ మరియు సమతుల్య అభివృద్ధి కోసం మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువచ్చామని, తాము ఈ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు సీఎం జగన్, అమిత్ షాకు నొక్కిచెప్పారు. ఈ విషయంలో తమకు ససహకరించాలని కేంద్ర హోంమంత్రికి జగన్ విజ్ఞప్తి చేశారు.