CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravathi, August 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను 2023, జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని తెలిపారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్వే కోసం అవసరమైన పరికరాలు, వనరులు సమకూర్చుకోవాలని అన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించాలని సూచించారు. అలాగే భూసర్వే చేపట్టే సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేసేలా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతి జరగకూడదని సీఎం వైఎస్ జగన్ నొక్కి చెప్పారు.

ఇక, సమగ్ర భూ సర్వే పురోగతికి సంబంధించి ప్రతి 4 వారాలకు ఒకసారి సమీక్ష చేస్తాన‌ని సీఎం జ‌గ‌న్ అధికారులకు స్ప‌ష్టం చేశారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే కాన్ఫరెన్స్‌లో కూడా సమీక్షిస్తా. వారానికి ఒకసారి మంత్రుల కమిటీ కూడా సమీక్ష చేయాల‌ని సీఎం సూచించారు. సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, అవసరమైతే సర్వే ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

అంతకుముందు రెండు- మూడు రోజుల కిందట జరిగిన మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో మైనరిటీ సబ్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్, సమగ్ర భూ సర్వేతో పాటుగానే వక్ఫ్ భూములను కూడా సర్వే చేయాలని నిర్ణయించారు.