
Amaravati, July 11: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ( municipal workers issues) అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌లతో కూడిన హై పవర్ కమిటీని సమస్య పరిష్కారం కోసం నియమించినట్టు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా పనులు, నిధులు మంజూరుచేసి పని పూర్తిచేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అంతేకాదు గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు. ఆప్షన్ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
అమర్‌నాథ్ యాత్రలో పెను విషాదం, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి, 35 మంది సురక్షతంగా ఇళ్లకు..
ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అంతేకాదు.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా? లేదా? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? తదితర వనరుల విషయంలో పరిశీలనలు చేయాలని తెలిపారు.
అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని.. ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాదు, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాలి. స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.