Amaravati, Dec 29: ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ పాలవెల్లువ పథకాన్ని(Jagananna Palavelluva) ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ ( CM YS Jagan) మాట్లాడుతూ.. 'కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చారిత్రాత్మక ఘట్టం. జిల్లాలో రైతులు, అక్కాచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది.
ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్సార్ జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చింది.
అధికారంలోకి రాగానే అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టాం. పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే అమూల్ (Jagananna Palavelluva in collab with Amul) నెంబర్ వన్ స్థానంలో ఉంది. అమూల్ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. ప్రపంచంలో అమూల్ ఎనిమిదో స్థానంలో ఉంది. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప ప్రక్రియ కూడా అమూల్‌లో ఉంది. పాల బిల్లును కూడా పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మహిళా సాధికారతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాం. అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్ కూడా లభిస్తుంది. లీటర్‌కు 50 పైసలు చొప్పున బోనస్ ఇస్తారు' అని సీఎం జగన్ అన్నారు.
గతేడాది నవంబర్‌లో జగనన్న పాలవెల్లువ కింద వైఎస్సార్, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలో 71,373 లీటర్ల పాలు సేకరించగా, ఈ ఏడాది నవంబర్‌లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 21,57,330 లీటర్ల పాలు సేకరించారు. ఇప్పటివరకు 1,093 ఆర్బీకేల పరిధిలో 1,906 గ్రామాలకు చెందిన 1,79,248 మంది రైతుల నుంచి 93,73,673 లీటర్ల గేదె పాలు, 73,96,857 లీటర్ల ఆవు పాలు కలిపి 1.67 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. రోజూ 30,640 మంది రైతుల నుంచి సగటున 75 వేల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తున్నారు.
పాలు పోసిన రైతులకు ఇప్పటివరకు రూ.71.20 కోట్లు చెల్లించగా.. గతంతో పోలిస్తే వీరు రూ.10.50 కోట్లకు పైగా అదనపు లబ్ధి పొందారు. ప్రైవేటు డెయిరీలు కొవ్వు, వెన్న శాతాలను తగ్గిస్తూ ధరలో కోత పెడుతుంటే జగనన్న పాలవెల్లువలో మాత్రం గరిష్టంగా లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవు పాలకు రూ.35.36 చొప్పున చెల్లిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 310 గ్రామాల్లో 20,422 మంది, విశాఖపట్నం జిల్లాలో 236 గ్రామాల్లో 30,464 మంది, కృష్ణా జిల్లాలో 314 గ్రామాల పరిధిలో 37,474 మంది అమూల్‌కు పాలు పోసేందుకు ముందుకొచ్చారు. ట్రయిల్ రన్‌లో 100 గ్రామాల్లో 1,057 మంది మహిళా పాడి రైతులు రోజూ 6,700 లీటర్ల పాలు పోస్తున్నారు.