Amaravati, May 16: ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా(YSR Rythu Bharosa) కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేశారు. రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఖరీఫ్ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేలండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు.
వైఎస్సార్ మత్స్యకార భరోసా, 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ. 109 కోట్లు జమ చేసిన ఏపీ సర్కారు
రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్ (CM YS Jagan) అన్నారు. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశామన్నారు. ఎన్నడూలేని విధంగా మూడేళ్లలో రైతులకు లక్షా 10వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ రోజు రూ.5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం అన్నారు.
మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు. మన ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు. రైతులకు మంచి చేయాలని మనసుతో ఆలోచించే ప్రభుత్వమిది. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నాం.
చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయల్దేరాడు. పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. రైతుకు ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు చంద్రబాబు. రైతులపై కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు. రుణాల పేరుతో మోసం చేసిన నాయుకుడి పాలనను గుర్తుచేసుకోవాలని’’ సీఎం జగన్ అన్నారు.