AP CM YS Jagan | File Photo

Amaravathi, September 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MSME, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తాడేప‌ల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సంద‌ర్భంగా పారిశ్రామిక‌వేత్త‌లు, ఎంఎస్ఎంఈలు, టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్ మిల్ల‌ర్ల‌తో  సీఎం జగన్ వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు.

రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

గ‌తంలో హ‌డావిడి ఎక్కువ‌, ప‌ని త‌క్కువ‌గా ఉండేద‌ని, తమ ప్ర‌భుత్వం వ‌చ్చాక గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల‌కు పెట్టిన రూ.1,588 కోట్ల బ‌కాయిల‌ను కూడా చెల్లించింద‌న్నారు. గతంలో మాదిరిగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా, నిజంగా పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అది కనిపిస్తోంది. స్థానికులకు దాని వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వారి కళ్లముందే కనిపిస్తోంది. ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సెంటివ్‌ ఇస్తుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జగన్ అన్నారు.

ఇప్పటివరకు రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 62 శాతం, మహిళలకు 42 శాతం ప్రోత్సాహకాలు అందించాం. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశాం. కొప్పర్తిలో వైయ‌స్సార్‌ ఈఎంసీ పార్క్‌ను స్థాపిస్తున్నాం. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైయ‌స్సార్‌ ఈఎంసీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

చిన్న తరహా పరిశ్రమలతో పాటు, మధ్య తరహా పరిశ్రమలను కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతుంది. ఈ రోజు దేశం, రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా స్లోడౌన్‌ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక వైపు ప్రజలను కాపాడుకుంటూ, మరో వైపు పరిశ్రమలను నిలబెట్టే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.