Amaravati, Sep 8: అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై ఏపీ సీఎం సమీక్ష (CM Jagan in Action) నిర్వహించారు. ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు.
ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలని పేర్కొన్నారు. వైయస్సార్ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు అందించారు.
10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. 1615 క్లస్టర్ లెవల్ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించగా.. ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.
సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ ఉందని, 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి ఇవ్వాలని సీఎం తెలిపారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం.ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్న సీఎం, దీనికోసం ప్రభుత్వం రూ.1325 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు . ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లుగా ఉందన్నారు.