Amaravati, Jan 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి (CM YS Jagan Delhi Tour) వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు.అమిత్ షాతో (Home minister amit shah) పాటు ఇతర ముఖ్యనేతలతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ రోజు విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్‌పై సమీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం సమావేశంలో మాట్లాడుతూ.. టాయిలెట్ల నిర్వహణ అనేది ప్రాధాన్యతా అంశం. టాయిలెట్లు లేకపోవటం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల.. చాలావరకు స్కూళ్లకు పిల్లలు పోలేని పరిస్థితి నెలకొంది. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే బాగుచేసేలా చర్యలుండాలని తెలిపారు.
టాయిలెట్ల క్లీనింగ్‌పై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలి. విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లీష్ మీడియం ద్వారా అందుబాటులోకి నాణ్యమైన విద్య. విద్యార్థులకు పోషకాహారం కోసం గోరుముద్ద అమలు చేశాం’’ అని అన్నారు.