AP Chief Minister YS Jagan | File Photo

Amaravathi, July 22: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో గురువారం డబ్బు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నిరుపేదలుగా ఉన్న కాపు మహిళలకు మంచిచేయాలని, ఆర్థికంగా వారు వారి కాళ్ల మీద నిలబడే పరిస్థితి తీసుకురావాలనే నిండుమనసుతో వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి అన్నారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా , మేనిఫెస్టోలో చెప్పకపోయినా మేలు చేయాలనే తపనతో కాపు నేస్తం పథకాన్ని వరుసగా రెండో ఏడాది అమలు చేస్తున్నామని చెప్పారు.  45 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల చొప్పున అందించనున్నామన్నారు. 60 దాటిన వారికి ఎలాగో పెన్షన్‌ వస్తుందని చెప్పారు.  3,27,244 మంది అర్హులైన మహిళలకు వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా రూ.490.86 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కాపులకు చేసిన మోసాన్ని, మన ప్రభుత్వం చేస్తున్న మంచిని గమనించాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూపోతే రూ.75 వేలు లబ్దిదారుల చేతుల్లో ఉంటుంది. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతారని జగన్ అన్నారు. ఈ కులాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులేస్తోందని చెప్పారు. రెండేళ్లలో 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం' కింద రూ.12,126 కోట్లు అందించినట్లు సీఎం తెలిపారు.

వివక్షకు తావు లేకుండా, అవినీతి లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. కాగా, ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.