Kamalapuram, Dec 23: శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన (CM YS Jagan Speech) ప్రసంగించారు. నువ్వు మా బిడ్డ. రాష్ట్రం వైపు నువ్వు చూడు. మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం అని దీవించి పంపితే.. ఇవాళ మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పనులు చేస్తూ.. దేవుడి ఆశీస్సులతో ఇవాళ ఈ నియోజకవర్గంలోనూ మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు పేరుపేరునా అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) పేర్కొన్నారు.
దేవుడి ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. కృష్ణా నది కడపకు వచ్చిందంటే కారణం మహానేత వైఎస్‌ఆర్. మహానేత వైఎస్‌ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తైంది. జిల్లాలో ప్రాజెక్టుల కోసం తన తండ్రి, దివంగత మహానేత వైఎస్‌ఆర్ చేసిన కృషి కళ్లారా ఇప్పుడు చూస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
గత ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోలేదని, చిత్రావతి, గండికోటలలో నీటి నిల్వల సాధ్యం మీ బిడ్డ వైఎస్ జగన్ సీఎం కావడం వల్లే సాధ్యమైందని ఉద్ఘాటించారాయన. రూ.6,914 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ పూరైతే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అలాగే కృష్ణపట్నం పోర్ట్ నుంచి రైల్వే లైన్ కోసం రూ.68 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారాయన. రూ.550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గంలో బైపాస్‌తో పాటు రోడ్డు పనులకు సంబంధించిన నిధుల కేటాయింపులను, ఇంకా పలు అభివృద్ది పనులు వివరాలను.. తద్వారా కలిగే ప్రయోజనాలకు ఆయన స్వయంగా తెలిపారు. ఇవాళ రూ.905 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా.. జనవరి చివరి వారంలో జిల్లాలో మరో మంచి కార్యక్రమం జరగబోతోందని సీఎం జగన్ ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అడుగులు జనవరి నెలాఖరులో ముందకు పడతాయని ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును గత పాలకులు పట్టించుకోలేదని, ఆ కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన వివరించారు. జిందాల్ సౌజన్యంతో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ శ్రీకారం చుడతామని తెలిపారు.
మహిళా పక్షపాత ప్రభుత్వం తమదని, నేరుగా బటన్ నొక్కి అక్కచెళ్లెమ్మల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. లంచాలకు, వివక్షకు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క నియోజకవర్గంలో 66వేలకు పైగా కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందిందని తెలియజేశారు. పరిపాలనలో మీ బిడ్డ తీసుకొచ్చిన మార్పును గుర్తించాలని, గతంలో పాలన ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రూ.1,000 మాత్రమే వచ్చింది. ఆ పెన్షన్ కోసం వెళ్తే ఏ పార్టీకి చెందిన వాళ్లని అడిగేవాళ్లు.. లంచాలు అడిగేవాళ్లని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అర్హత ఉంటే చాలూ.. నేరుగా అందుతోందని అన్నారు.
ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరోపార్టీ అని చంద్రబాబులా, చంద్రబాబు దత్తపుత్రుడు మాదిరిగా ఈ భార్యకాకపోతే మరో భార్య అని తాను అననని, ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానమని గట్టిగా నినదించారు సీఎం జగన్ .
నాయకుడంటే.. విశ్వసనీయత ఉండాలి. మాట మీద నిలబడాలి. అతన్ని చూసి ప్రతీ కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. మీ బిడ్డను ఇప్పుడు గర్వంగా చెప్తున్నా.. పవిత్రంగా భావించే మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చింది ఈ ప్రభుత్వం. ఇవాళ ప్రతీ కార్యకర్త ప్రతీ గడప గడపకు వెళ్లి ‘‘అన్న ముఖ్యమంత్రి అయ్యాడు. హామీలు నెరవేరాయి’’ గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పగలుగుతున్నారు. కానీ కొందరు ఉంటారు. ఎన్నికలప్పుడు వస్తారు.
మాయ మాటలు చెప్తారు. మేనిఫెస్టోను చెత బుట్టలో పడేస్తారు. అలాంటి వాళ్లకు.. మాట మీద నిలబడే మీ బిడ్డ వైఎస్ జగన్‌కు యుద్ధం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకునేది దేవుడ్ని, మిమ్మల్ని. మంచి చేశాం అని సగర్వంగా చెప్పగలుగుతున్నా. ఎన్నికలు వస్తాయి.. పోతాయి. కానీ, మంచి చేస్తే.. చనిపోయినా అవతలి వాళ్ల గుండెలో బతుకుతాడు. అది ఒక వరం. దాని కోసం మాత్రమే మీ బిడ్డ వైఎస్ జగన్ పాకులాడుతాని స్పష్టం చేశారాయన.