Amaravati, August 4: ఏపీలో విస్తారమైన తీరప్రాంతం ఉంది. అటు శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి జిల్లా (Tirupati) వరకు ఉన్న ఏపీ కోస్తా తీరం.. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారింది. పోర్టులతో పాటు మత్స్యకారులకు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు ఈ తీరప్రాంతం కీలకంగా మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే పర్యాటక రంగంలో కూడా ఈ తీర ప్రాంతం మరింత ముఖ్యమైనది అని చెపపవచ్చు.ఈ నేపథ్యంలో ఏపీ తీరంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు (coastal area under the threat) ఎదుర్కొంటున్న తీరప్రాంతం 20 శాతానికి పైనే ఉన్నట్లు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS Report) అధ్యయనంలో తేలినట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ (Union Minister Nithyanandra Roy
) చెప్పారు.వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఒక మోస్తరుగాను, 0.55 శాతం తీరానికి కోత ముప్పు అతి తీవ్రంగాను ఉందని ఇన్‌కాయిస్ అధ్యయనం పేర్కొందని వివరించారు.
సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఎంఎఫ్)కి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వల్ల నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయనిధి నుంచి మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి, దీనికి 2021–22 నుంచి 2025–26 కాలానికి రూ.68,463 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. సముద్రకోతల వల్ల తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్ సైన్సెస్ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తూ సాంకేతికపరమైన పరిష్కారమార్గాలను సూచిస్తున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో కోస్తా జిల్లాల్లో ఇప్పుడు కాస్త అలజడి మొదలైంది. ఇప్పటికే తుఫాన్లు, భారీ వర్షాలతో నిత్యం ముప్పు ముంగిట ఉంటున్న జిల్లాలకు ఇప్పుడు కోస్తా తీరం కోతకు గురవుతుందని నివేదికతో తీర ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
కేంద్ర సాయుధ పోలీసు దళాల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించే జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్.. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. సైనిక దళాల్లో ఉద్యోగాల భర్తీ కుల ప్రాతిపదికన జరగదని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్ ప్రాతిపదికపైనే ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్ కులాల కోటాలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నిర్వహించే నియామకంలో భర్తీచేస్తామని చెప్పారు.