Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, Oct 5: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో కొత్త‌గా 6,242 కొవిడ్‌‌-19 పాజిటివ్ కేసులు (Andhra Pradesh Coronavirus) న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,811 క‌రోనా టెస్టులు చేయ‌గా వీటిలో 6,242 పాజిటివ్‌గా నిర్ధార‌ణ (coronavirus update) అయ్యాయి. కొత్తగా 40 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 5,981కి (coronavirus Deaths) చేరింది.

మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 7,084 మంది కోవిడ్‌ను (Coronavirus) జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 60,94,206 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా సంభ‌వించిన కొవిడ్‌ మ‌ర‌ణాల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణాలో ఆరుగురు, అనంత‌పురం, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావ‌రి, గుంటూరు, నెల్లూరులో న‌లుగురు, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, శ్రీ‌కాకుళం, ప‌శ్చిమ గోదావ‌రిలో ఇద్ద‌రు, క‌ర్నూల్, విజ‌య‌న‌గ‌రంలో ఒక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు. ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 442 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,356కి చేరింది.

వ్యాక్సిన్‌పై తీపి కబురు, వచ్చే ఏడాది జూలై నాటికి 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

ఒంగోలులో అత్యధికంగా 39 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 501 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 70 మంది డిశ్చార్జ్ అయ్యారు. 13 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 5631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) ఆదివారం కన్నుమూశారు. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. గత నెలవరకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా పనిచేశారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్సతో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు.

మాజీ ఎమ్మెల్యే, వీఆర్‌ఎండీఏ మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్‌ మృదుభాషి అని నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు కుటుంబం కీలకపాత్ర పోషిస్తూ వచ్చిందన్నారు. శ్రీనివాస్‌ మరణం తనకు ఎంతో హృదయవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.