Amaravati, Oct 19: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132 కు చేరింది. కొత్తగా 23 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,474యాక్టివ్ కేసులు (Andhra Pradesh coronavirus Update) ఉన్నాయి.
కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముందుకు దూసుకుపోతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. దేశ సగటు రికవరీ రేటు 87.78గా నమోదైంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా రికవరీలో ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, ట్రూనాట్ మెషీన్లతో పాటు యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిలియన్ జనాభాకు 1,32,326 మందికి టెస్టులు చేస్తున్నారు. 1,23,111 మందికి పరీక్షలు చేస్తూ అసోం రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.
ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత పదును పెంచుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వేల సంఖ్యలో వ్యాధులను చేర్చడం, రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి భారీ సంస్కరణలకు సర్కార్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేదలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా మరిన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది.