Guntur, Dec 27: అమెరికా సహా కెనడాలో మంచు తుపాను (bomb cyclone) బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటి వరకు 60 మంది వరకు మృతి చెందారు. తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలో న్యూజెర్సీలో విహారయాత్రకు వెళ్లి (AP Couple Dies in America) గల్లంతయ్యారు.
అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో నివాసం ఉంటూ గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఈ దంపతులు నిన్న ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు. ఓ సరస్సును దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. ఐస్ లేక్ దగ్గర ఫొటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు.
హరితను గుర్తించిన రెస్క్యూ సిబ్బంది సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. అయినా.. ఆమె ప్రాణాలు (Couple killed in america) కాపాడలేకపోయారు. నారాయణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పాలపర్రులోని వారి తల్లిదండ్రులకు సమాచారమందింది.
నిన్న రాత్రి నారాయణ పాలపర్రులోని తండ్రికి ఫోన్ చేసి విహారయాత్రకు వెళ్తున్నామని చెప్పాడని.. ఇంతలోనే ఘోరం జరిగిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నారాయణ, హరిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో కుటుంబంతో కలిసి నారాయణ స్వగ్రామం వచ్చారు. కొద్ది రోజులు బంధువులతో ఆనందంగా గడిపి వెళ్లారని.. ఇంతలోనే దుర్ఘటన జరిగిందని వాపోతున్నారు.