COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2627 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 66 పాజిటివ్ కేసులు నమోదు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా 29 మందికి సోకిన కరోనా వైరస్
Coronavirus in AP (Photo Credits: IANS)

Amaravathi, May 23:  ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2627 కు చేరింది. కొత్తగా నమోదైన కరోనా మరణాలేమి లేకపోవడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 56 గా ఉంది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 29 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1807 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 764 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,357 సాంపిల్స్‌ని పరీక్షిస్తే 66 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారింపబడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో మరో 11 మందికి పాజిటివ్ అని తేలింది. అవి చిత్తూరు నుంచి 3, నెల్లూరు 8 కేసులు నమోదయ్యాయి.

ఇక విదేశాల నుంచి ఏపికి వస్తున్న వారిలో కూడా కొంతమందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఆదివారం ఉదయం వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 17 పాజిటివ్ కేసులు కువైట్, దుబాయ్ మరియు ఖతార్ దేశాల నుంచి వచ్చిన వారేనని అధికారులు వెల్లడించారు.

కరోనా లక్షణాలపై గోప్యత పాటించొద్దు

చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలకు వెళ్లకుండా రోగాన్ని దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తూర్పు గోదావరి జిల్లా అధికారులు చెబుతున్నారు.  జిల్లాలోని కత్తిపూడిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గొల్లల మామిడాడకు చెందిన హోటల్‌ క్యాషియర్‌ కూడా ఇలాగే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారన్నారు. ఉపాధ్యాయుడు మృత్యువు అంచుల వరకూ వెళ్లి బయటపడినా, కరోనా లక్షణాలపై గోప్యత పాటించి మరికొంత మందికి పాజిటివ్‌ రావడానికి కారణమయ్యాడని అధికారులు పేర్కొన్నారు.

గొల్లల మామిడాడలో ఓ హోటల్‌ క్యాషియర్‌ కోవిడ్ ద్వారా మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడి ద్వారా గత 48 గంటల్లో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్యాని అధికారులు తెలిపారు. ఒక్కచోటే ఇన్ని కేసులు రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో నివాసముండే వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలని అనుమానముంటే వెంటనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.