ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.వివరాలను cse.apgov.in వెబ్‌సైట్‌లో ఉంచారు.
దరఖాస్తు రుసుం ఫిబ్రవరి 21వరకు చెల్లించవచ్చు. ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయో పరిమితి జులై 1, 2024 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు మించరాదు.AP DSC 2024 పరీక్షకు మార్చి 5 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి.
సెషన్ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; సెషన్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటిస్తారు. 2018 డీఎస్సీ సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు.